గుంతకల్లు రైల్వే స్టేషన్ యార్డులో మంగళవారం రాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. జిందాల్ నుంచి గుత్తి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు 13, 14 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన సౌత్ క్యాబిన్ వద్ద చోటుచేసుకోగా, వెంటనే రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
రెండు వ్యాగన్లు పూర్తిగా పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అప్రమత్తమై ట్రాక్ మరమ్మతు పనులను వేగవంతం చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటన కారణంగా ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును తిమ్మనచెర్ల వద్ద నిలిపివేశారు. అలాగే హుబ్లీ-విజయవాడ అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలును బైపాస్ మీదుగా మళ్లించారు. మంగళవారం రాత్రి రావాల్సిన వారణాసి రైలు, గుత్తి, విజయవాడలకు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గత వారం రోజుల్లో కూడా గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో ఇంజిన్ పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. మళ్లీ అలాంటి ప్రమాదమే చోటుచేసుకోవడంతో రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.