మన దేశంలో బంగారం ధరలు చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు తొలిసారి రూ. 1,01,350కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,900 వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రూ. 3,000 వరకూ ధర పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇలాంటి ధరల పెరుగుదల ముఖ్యంగా శుభకార్యాలు, పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో బంగారం కొనాలనుకునే వినియోగదారులకు భారంగా మారింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయి ధరలు నమోదవుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,01,000గా ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో ఈ ధర ₹1,11,000గా నమోదవడం గమనార్హం. బంగారం ధరలతో పాటు వెండిపై కూడా ప్రభావం కనిపిస్తోంది.
ఈ ధరల వివరాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ట్రేడింగ్ వెబ్‌సైట్ల ఆధారంగా వెల్లడయ్యాయి. బంగారం ధరలు ఇలా ఊహించని రీతిలో పెరగడం సామాన్య ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారానికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఇప్పుడు కొనుగోలు చేయాలంటే సాధారణ ప్రజలకు ఇది భారం అయ్యే అవకాశం ఉంది.