ఈసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా, తరువాత ఒక టెస్టును డ్రాగా ముగించగా, మరొక రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా సిరీస్‌లు కోల్పోవడంతో ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆటగాళ్ల నిర్లక్ష్యమైన ప్రదర్శనపై గౌతీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు తమ ఇష్టానుసారం ఆడుతున్నారని, జట్టు ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు చేసిన తప్పిదాలపై గంభీర్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.
మెల్‌బోర్న్‌లో ఓడిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ ఆటగాళ్లను గట్టిగా హెచ్చరించాడు. జట్టు కోసం తన పద్ధతిలో ఆడనివారికి ఇక ఎగ్జిట్ డోర్ చూపించేందుకు సిద్ధమని వెల్లడించాడని సమాచారం. గత ఆరు నెలలుగా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చిన గంభీర్, ఆ శైలిని ఇకపై ఆపివేస్తున్నట్లు ప్రకటించాడు.
భారత ఆటగాళ్లు సమర్థవంతమైన ప్రదర్శన లేకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆడుతున్నట్లు గంభీర్ భావిస్తున్నాడు. వరుస సిరీస్‌లను కోల్పోవడం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అర్హత సాధించే అవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో ప్రధాన మార్పులు జరగనున్నాయని చర్చలు జరుగుతున్నాయి.