ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అర్బన్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు హర్బన్ సీఐ సురేష్ బృందం నిఘా ఉంచి వారిని పట్టుకుంది. ముగ్గురిలో ఒకరు గిద్దలూరు వ్యక్తి కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందినవారని గుర్తించారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మార్కాపురం డిఎస్పి యు నాగరాజు తెలిపారు.
గిద్దలూరు ప్రాంతంలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరా చేసే నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు నిఘాను మరింత కఠినతరం చేస్తున్నామని, వీటికి సంబంధించి సాంకేతిక సహాయాన్ని కూడా వినియోగిస్తున్నామని తెలిపారు.
మర్కాపురం డిఎస్పి యు నాగరాజు మాట్లాడుతూ, గిద్దలూరు ఏరియాలో గంజాయి విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల సహాయంతో శిక్షణ పొందిన బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు వివరించారు. అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ప్రెస్ మీట్‌లో గిద్దలూరు హర్బన్ సీఐ సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, మార్కాపురం డిఎస్పి యు నాగరాజు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించాల్సిందిగా కోరారు.