తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు దళపతి విజయ్‌పై ఉత్తరప్రదేశ్ బరేలీలోని సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఈ ఫత్వాను ప్రకటించారు. ఇఫ్తార్ విందులకు మద్యం సేవించే వారిని, జూదగాళ్లను ఆహ్వానించడం పాపమని ఆయన అభిప్రాయపడ్డారు.
విజయ్ గతంలో చేసిన చర్యలు ఆయనను ఇస్లాం వ్యతిరేకిగా నిరూపిస్తున్నాయని మౌలానా పేర్కొన్నారు. ముఖ్యంగా ‘ది బీస్ట్’ సినిమా ద్వారా ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని ఆయన విమర్శించారు. రంజాన్ సమయంలో ఇఫ్తార్‌కు అలాంటి వ్యక్తులను పిలిచిన విజయ్ పవిత్రతను తారుమారు చేశారని ఆరోపించారు.
ఇలాంటి చర్యలు ముస్లింలు తగిన ప్రాధాన్యత ఇవ్వకూడదని, తమిళనాడు ముస్లింలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మతపరమైన కార్యక్రమాలకు విజయ్‌ను ఆహ్వానించవద్దని, ఆయన రాజకీయ ప్రోపగండాకు మతాన్ని వినియోగించరాదని రజ్వీ స్పష్టం చేశారు.
విజయ్ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని, ఆయనపై ముస్లింలు అపనమ్మకంతో ఉండాలని రజ్వీ హెచ్చరించారు. అతని సమావేశాలకు, కార్యక్రమాలకు ముస్లింలు హాజరు కాకూడదని కోరారు.