ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, డిస్ట్రిక్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులయ్య ఆదేశాల మేరకు చింతలపూడి ప్రాంతంలో నాటు సారా దందాపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుప్రీంపేటకు చెందిన కొమ్మిగిరి మాధవిని 20 లీటర్ల నాటు సారాయితో, చవటపాము శ్రీనివాసరావును 2 లీటర్ల నాటు సారాయితో అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.
చింతలపూడి మండలంలో నాటు సారా వ్యాపారాన్ని నిరోధించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పాత నాటు సారాయి ముద్దాయిగా చవటపాము లక్ష్మిని, ప్రస్తుతం నాటు సారా తయారీదారులుగా కొమ్మిగిరి మాధవి, శ్రీనివాసరావులను గుర్తించారు. అలాగే బెల్లం వ్యాపారులు జల్లు కుమార్, వజ్రపు మహేశ్వరరావు, బుద్దాల శ్రీనివాసరావు, రతికంట జగదీష్, అక్కల శివాజీ లకు నోటీసులు జారీ చేశారు.
ఈ వ్యాపారులు నాటు సారా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వారి వ్యాపార కార్యకలాపాలను నియంత్రించేందుకు స్థానిక MRO ఎదుట 129 BNS, 128 BNS ప్రకారం బైండోవర్ చేశారు. చింతలపూడి CI పి. అశోక్ ఈ చర్యలపై సమగ్రంగా వివరించారు.
ఈ దాడులలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సైలు నరసింహారావు, అబ్దుల్ కలీల్, హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుళ్లు రమేష్, సత్యనారాయణ, మహిళా కానిస్టేబుల్ శివప్రియా పాల్గొన్నారు. చింతలపూడి ప్రాంతంలో నాటు సారా నిర్మూలనకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.