ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజీవ్ నగర్ కాలనీలో రెండు మూగజీవాల మిత్రత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక కుక్క, ఒక కోతి మధ్య ఏర్పడిన అనుబంధం అక్కడి ప్రజలను ఆనందానికి, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కులాలు, మతాలు, దేవుళ్ల పేరుతో మనుషులు తగాదాలు పడుతూ ఉన్న ఈ సమాజంలో, వీటి మైత్రి అందరికీ గొప్ప గుణపాఠంగా మారుతోంది.
కుక్క ఎక్కడికెళ్లినా కోతి దాని వీపుపై ఎక్కి వెళుతోంది. వేరు వేరు జాతులలో జన్మించినా, ఇవి విడిపోవడం అసాధ్యమయ్యింది. స్వార్థంతో మానవులు రక్తసంబంధాలను కూడా ఆర్థిక లావాదేవీలతో ముడిపెడుతుంటే, ఈ మూగజీవాలు స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి. వాటి మధ్య ఉన్న అనుబంధం చూసిన వారందరూ మానవ సంబంధాల గురించి మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది.
రాజీవ్ నగర్ కాలనీలో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. కోతి కుక్క వీపుపై స్నేహంగా ప్రయాణం చేయడం, దాని తోడుగా ఉండటం మనుషులకు అనేక విషయాలు నేర్పిస్తుంది. నిజమైన అనుబంధం ఎలాంటి విభేదాలను కూడా దాటుకొని ముందుకు సాగుతుందని ఇది చాటి చెబుతోంది.
ఈ రెండు మూగజీవాల మైత్రి కథ వైరల్‌గా మారుతోంది. వాటి మమకారం చూసి మనుషులు తమ వ్యక్తిగత కోపాలను, విభేదాలను పక్కనపెట్టి, నిజమైన బంధాలకు విలువ ఇవ్వాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కులమత భేదాలను మరిచి, ప్రేమ, అనుబంధం ఎంత ముఖ్యమో కుక్క-కోతి స్నేహం మళ్లీ గుర్తు చేస్తోంది.