ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్ట్ కోసం 2008లో రిలయన్స్ సంస్థకు 2600 ఎకరాల భూమి కేటాయించారు. కానీ, 16 ఏళ్లుగా ఆ భూములు ఖాళీగానే ఉన్నాయి. పరిశ్రమలు అభివృద్ధి చేయాలని రైతులు భూమి త్యాగం చేసినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీనిపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భూమిని పరిశ్రమలకు కేటాయించిన తర్వాత రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కావాలని ఇండస్ట్రీయల్ పాలసీలో స్పష్టంగా ఉంది. నాలుగేళ్లైనా పని మొదలుకాకపోతే చర్యలు తీసుకోవాలని ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆక్షేపించారు. భూమిని బీడుగా పెట్టి, రైతులు, కూలీలను ఉపాధి లేకుండా చేయడం దురదృష్టకరమన్నారు.
ప్రస్తుతం రిలయన్స్ సంస్థ 2029 నాటికి రూ.20 వేల కోట్ల పెట్టుబడితో రెండు యూనిట్లు స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఒక్కో యూనిట్‌లో 800-1000 ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. అయితే, ఈ ఉద్యోగాలను పూర్తిగా స్థానికులకు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 2600 ఎకరాల భూమి మొత్తం పరిశ్రమ కోసం అవసరమా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని అన్నారు.
జిల్లాలో వేలాది ఎకరాల భూములు పరిశ్రమల అభివృద్ధి కోసం ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తేవాలని సోమిరెడ్డి కోరారు. ఖాళీగా ఉన్న భూములను క్లస్టర్లుగా అభివృద్ధి చేసి, మరిన్ని పరిశ్రమలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల త్యాగాన్ని వృధా చేయకుండా, వీలైనంత త్వరగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.