నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు. రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఐదు పడకలతో ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాలను కేంద్రం కేటాయించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 18 డయాలసిస్ కేంద్రాలను 10 నెలల వ్యవధిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మెట్టు ప్రాంతమైన వింజమూరులో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి రోగులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
వింజమూరులో సుమారు 80 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని, వారికి నాణ్యమైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్‌ను ప్రారంభించామని వివరించారు. రోగులు ఇకపై జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామంలోనే చికిత్స పొందగలుగుతారని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర బడ్జెట్లో డయాలసిస్ చికిత్స విభాగానికి ప్రత్యేకంగా రూ.65 కోట్లు కేటాయించామని, పేదవారికి అందుబాటులో ఉండేలా సేవలను విస్తరిస్తామని మంత్రి సత్య కుమార్ స్పష్టంగా తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పెద్దఎత్తున హాజరయ్యారు.