దేశాయిపేట, ఆమోదగిరి పట్నంలో గత వైకాపా ప్రభుత్వంలో సెక్షన్ అయిన రోడ్ వేతనం ఆగిపోయిన నేపథ్యంలో, ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పంచాయతీ కాంట్రాక్టర్ భాను, పి.ఆర్ డిపార్ట్మెంట్ ఏ.ఈ మరియు సెక్రటరీ గారు యర్రా రూపానంద్ ఇంటి స్థలములో పార్కింగ్ చేసి ఉన్న కార్ పై తెలియజేయకుండానే రోడ్ వేయడం జరిగింది. కార్ టైర్లు మునిగిపోయేలా సిమెంట్ వేశారనే ఆవేదనను బాధితుడు వ్యక్తం చేశాడు.
ఈ ఘటనపై బాధితుడు సంబంధిత పంచాయతీ అధికారులను అడిగినప్పటికీ వారు దురుసుగా స్పందించారట. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి, రోడ్ పనులపై సరైన పర్యవేక్షణ లేకుండా చేయడం వల్ల తన ఆస్తికి నష్టం జరిగింది అని బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించకపోవడంతో, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.
స్థానికులను అడిగితే వారు కూడా ఇది అన్యాయంగా జరిగిందని పేర్కొన్నారు. బాధితుడు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్ మీదే రోడ్ వేయడం తీవ్ర నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. ప్రజల మధ్య అధికారులు, కాంట్రాక్టర్ల పై నమ్మకం తగ్గుతున్నదని అభిప్రాయపడ్డారు.
ఇక, గత 15 రోజుల క్రితమే రోడ్ కొలతలు వేసి, ఆక్రమణలు తొలగించి సిమెంట్ రోడ్ వేయాలని వేటపాలెం మండల తహసీల్దార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయాడు. ఆయన కారును పూర్తిగా డ్యామేజ్ చేస్తూ రోడ్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.