పాలకొండ ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద సీఐటీయూ, కెవిపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. కృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ఎస్సీ/ఎస్టీ ప్రజలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ నిలిపివేయడం అన్యాయమన్నారు.
గత ఐదేళ్లుగా ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం, ఇప్పుడు వేలాది రూపాయలు చెల్లించమంటూ ఒత్తిడి తెస్తోందని వారు ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ ప్రజలను మోసగించేందుకు, వారి సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు.
కరెంట్ బిల్లులు కట్టలేని వారి ఇళ్లకు విద్యుత్ నిలిపివేయడం అమానుషమని, ఉచిత విద్యుత్ కొనసాగించడంతో పాటు ఇప్పటికే వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని, విద్యుత్ కోతలు నిలిపివేయాలని అన్నారు.
ఈ నిరసనలో సీఐటీయూ మండల కార్యదర్శి కాదా రాము, దూసి దుర్గారావు, విద్యుత్ వినియోగదారులు టీ. పార్వతి, కే. ఆదినారాయణ, దళిత మహిళలు పాల్గొన్నారు. అనంతరం వినతిపత్రాన్ని అధికారికి అందజేయగా, 200 యూనిట్ల లోపల విద్యుత్ ఉచితంగా కొనసాగిస్తామని, తప్పుడు బిల్లులు సరిచేస్తామని హామీ ఇచ్చారు.
