కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్‌లో దీక్ష దివస్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు గంప గోవర్ధన్, జాజల సురేందర్, యంకె ముజీబోద్దిన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
సభకు ముందు, నేతలు భారీ ర్యాలీగా తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు అర్పించారు. అనంతరం కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద కూడా పూలమాలలు వేసి గౌరవం తెలిపి తెలంగాణ ఉద్యమ త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
సభ ప్రారంభంలో సత్య కన్వెన్షన్ హాల్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
కేసీఆర్ అప్పటి కేంద్రం మరియు సీమాంధ్ర నేతలతో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం గురించి కార్యకర్తలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమానికి ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. నాయకులు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.