వేపాడ మండలంలోని వళ్ళంపూడి పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎస్ఐ బొడ్డు దేవిని తక్షణమే సస్పెండ్ చేయాలని, ఆమెపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత నెల 11న గుడివాడ గ్రామంలో జరిగిన వేణుగోపాలస్వామి జాతరలో చోటుచేసుకున్న ఘటనపై స్పందిస్తూ ఈ నిరసన నిర్వహించారు.
జాతర సందర్భంగా “డాన్స్ బేబీ డాన్స్” కార్యక్రమంలో గుడివాడ గ్రామానికి చెందిన మోహన్‌కి మరియు ఎస్ఐ దేవికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకోవడంతో అది వివాదంగా మారింది. ఈ నేపధ్యంలో సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయకపోవడం, ఎస్ఐని సస్పెండ్ చేయకపోవడం పట్ల దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా దళిత కూలి రైతుసంఘ రాష్ట్ర కార్యదర్శి గాలి ఈశ్వరరావు నేతృత్వంలో, వళ్ళంపూడి పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఎమ్మార్వో రాములమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్ఐపై చార్జిషీట్ దాఖలు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.