మదనపల్లి కేంద్రంగా “డిజిటల్ అరెస్ట్” పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి 1-టౌన్ పోలీసులు బయటపెట్టారు. 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు రేపురి బెంజిమెన్‌ను లక్ష్యంగా చేసుకున్న నిందితులు సీబీఐ లేదా ఈడీ అధికారులమని నటిస్తూ, “మీపై కేసు ఉంది” అంటూ భయపెట్టి వీడియో కాల్‌లో ఉంచి 48 లక్షలు బదిలీ చేయించారు.
చట్టంలో లేని “డిజిటల్ అరెస్ట్” పేరును ఉపయోగించి బాధితుడిని మానసిక ఒత్తిడికి గురిచేశారు. రాయచోటిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోగా, ఖాతాల్లో ఉన్న 7.65 లక్షలు ఫ్రీజ్ చేశారు.
ALSO READ:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి: గజ్వేల్‌లో నివాళులు
ఈ ముఠా కార్యకలాపాలు కాంబోడియా మరియు కువైట్ కేంద్రాల నుండి జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన అధికారులను ఎస్పీ ధీరజ్ అభినందించారు.
“డిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఏం లేదు. ఏ సంస్థా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయదు. ఎవరూ ఆన్‌లైన్‌లో డబ్బులు అడగరు. అనుమానం వచ్చిన వెంటనే 1930కు కాల్ చేయాలి” అని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్లను కూడా ఎస్పీ విడుదల చేశారు.
