విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీలపై సిపిఎం ధర్నా

CPM leaders demand the government stop installing smart meters and roll back the true-up charges, calling it a burden on the public. They held a protest at the Yedcherla Substation. CPM leaders demand the government stop installing smart meters and roll back the true-up charges, calling it a burden on the public. They held a protest at the Yedcherla Substation.

ప్రజలు ఫై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఎచ్చెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు,కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని,నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు.వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారని, వైసిపి ప్రభుత్వం పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు.

అదానీ, షిర్డీ సాయి సంస్థలతో కుమ్మక్కయ్యి, వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకొని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించారు. నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్ కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మకద్రోహమేనని విమర్శించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టి ముందుగానే ప్రజలు డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలని,బ్యాలెన్స్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని,పేదలకు అంధకారమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు ప్రతి మీటర్ కు అయ్యే వ్యయం 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వేలాది రూపాయలు వినియోగదారుల నుండే వసూలు చేస్తారని,మరోవైపు విద్యుత్ అధికంగా వినియోగించే రాత్రి వేళల్లో అధిక రేట్లు వసూలు చేయటం నడ్డి విరిచే భారం కాదా అని ప్రశ్నించారు.వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఎసరపెట్టేందుకే పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారని ఏ భారం ఉండదని పైకి చెప్తున్నా ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ, ప్రజలపై భారాలు వేసేందుకు, ఉచిత విద్యుత్ ను దశలవారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకువచ్చారని విమర్శించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాడు వైసిపి, నేడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం గర్హనీయం అన్నారు.ఇప్పటికే 17 వేల కోట్ల రూపాయలు ట్రూ అప్ చార్జీల భారం వేస్తున్నారని మరోవైపు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచించటం తగదని అన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీల అంశంపై వైసిపి దారిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తున్నదని ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి స్మార్ట్ మీటర్లు ఆపాలని, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.బంగార్రాజు, జి. శ్రీనివాసరావు,ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు ఎం.సురేష్,కే.గోవిందకుమార్,ఎల్. రాము,ఎన్. రమణ,ఎల్.సీతారామ్, జె. చిట్టప్పడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *