పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిటి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత దావాలా రమణారావు మాట్లాడుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సమస్యలు పెరిగాయని, కానీ మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలను విస్మరించిందని విమర్శించారు. ఈ బడ్జెట్ నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని, ముఖ్యమైన రంగాలకు నిధులు గణనీయంగా తగ్గించారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన నిధులను బదిలీ చేయాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు గణనీయంగా నిధులు పెంచాలని, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు, సర్‌చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, ఆరోగ్య, విద్యా రంగాలకు జిడిపిలో తగిన శాతం కేటాయించాలని సూచించారు.
రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వం బిజెపి షరతులకు లొంగకుండా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని, రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ, పెండింగ్ ప్రాజెక్టులు, తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, మెడికల్ కాలేజీ, పిజి కాలేజీ, త్రాగునీరు, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.
చింతపండు, జీడి, పైనాపిల్, పసుపు తదితర గిరిజన ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం చిన్న పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి నష్టం జరిగిందని, దాన్ని భర్తీ చేసేందుకు ఈ బడ్జెట్‌లో కనీసం రూ. 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.