Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటివరకు రెండు దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ జరిగింది.
మొదట సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ చేరడంతో మంత్రుల సంఖ్య 16కి పెరిగింది.
రాజ్యాంగ పరంగా గరిష్టంగా 18 మంది మంత్రులకు అవకాశం ఉండటంతో ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో ఒకటి తనకు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తాను మంత్రి పదవిని పొందుతానని, అందుకోసం ఇప్పటివరకు ఓపికగా ఎదురుచూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులు ఉండకూడదనే వాదనను ఆయన తిరస్కరిస్తూ, తన సోదరుడు వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నా తనకు పదవి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. క్రికెట్‌లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఉదాహరణను ప్రస్తావిస్తూ తన వాదనను బలపరిచారు.
మిగిలిన రెండు మంత్రి పదవులను సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా భర్తీ చేయాల్సి ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం రాజకీయంగా ఆసక్తిగా మారింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో తదుపరి కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ మరింత పెరిగింది.
