నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే చేపట్టిన భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్య తేజ హెచ్చరించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 7వ డివిజన్ లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు పై భవన నిర్మాణ సామాగ్రిని ఉంచి రాకపోకలకు అడ్డంకిగా నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని గుర్తించి యజమానులకు జరిమానా విధించాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ ప్రజా మార్గాలకు అంతరాయం కలిగించే భవన నిర్మాణ సామాగ్రిని నోటీసులు అందజేసి తొలగించాలని కమిషనర్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక ఆత్మకూరు బస్టాండ్ పూల మార్కెట్ ప్రాంగణాన్ని కమిషనర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్క దుకాణదారు తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించి వాహనాలకు అందజేయాలని సూచించారు. స్థానిక ఆత్మకూరు బస్టాండ్ డిపో ప్రాంగణాన్ని పరిశీలించి డిపో మేనేజర్ తో ప్రత్యక్షంగా మాట్లాడారు. డిపో ప్రాంగణం మొత్తాన్ని క్రమం తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యటనలో భాగంగా స్థానిక హరనాధపురం లోని మురుగు నీటి శుద్ధి కేంద్రం పనితీరును అధికారులతో కలిసి పరిశీలించారు.
స్చిల్డ్రన్ పార్కు సమీపములో నూతనంగా నిర్మించిన భవనంలో ఏర్పాటుచేసిన ఆసుపత్రి భవనాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణకు నగరపాలక సంస్థ నుంచి అవసరమైన అనుమతులు, ట్రేడ్ లైసెన్సును పొందకుండా గత ఐదు నెలలుగా ఆస్తి పన్ను కూడా చెల్లించకుండా ఉండటాన్ని కమిషనర్ గుర్తించారు. భవన నిర్మాణం మొత్తం పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య శాఖాధికారితో ఫోన్లో మాట్లాడి అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రి పై తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ నిర్దేశించారు.
ఆకస్మిక తనిఖీలను నగరవ్యాప్తంగా చేపట్టి స్పెషల్ డ్రైవ్ ద్వారా అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలను గుర్తించి సంబంధిత అధికారులు సిబ్బందిపై సైతం శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అనంతరం స్థానిక 17వ డివిజన్లో జరుగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించి సిబ్బందికి వివిధ సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఇ. రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.