కర్తవ్య బాటలో భాగంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమును పురస్కరించుకొని సంగం మండలం లో సీఐ. వేమారెడ్డి, ఎస్ ఐ రాజేష్. ఆధ్వర్యంలో అమరులైన పోలీసులకు స్థానిక పోలీస్ స్టేషన్ సముదాయంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సమన్వయంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడానికి అక్టోబర్ 21 న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మన నేటి నిశ్చింత జీవితం అమరవీరుల అవిశ్రాంత త్యాగఫలమన్నారు. నిరంతరం అసాంఘిక శక్తులతో పోరాడుతూ సమ సమాజ నిర్మాణానికి అహర్నిశలు పాటుపడుతూ ఎంతోమంది పోలీసులు అమరులు అవుతున్నారన్నారు.
వారి యొక్క త్యాగానికి స్ఫూర్తిదాయకంగా వారి త్యాగాలను స్మరించుకోవడం గర్వించదగిన అంశమన్నారు. పోలీస్ వ్యవస్థ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించడం చాలా కష్టమని స్పష్టం చేశారు. అలాంటి పోలీసులు విధి నిర్వహణలో కష్టనష్టాలను ఓడ్చి ప్రజలను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తున్నామన్నారు. భారత్ చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గల హాట్ స్ప్రింగ్ అనే ప్రదేశంలో 1959 అక్టోబర్ 21వ తేదీన సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ముస్కరులు ఆకస్మికంగా దాడి చేసిన సంఘటనలో 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి తమ ప్రాణాలను అర్పించారన్నారు. పోలీసు విధి నిర్వహణలో ఎంతో ప్రమాదం మరియు త్యాగం నిండి ఉంటుందన్నారు.అమరులు ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకున్నా వారు మన హృదయంలో చిరస్మరణీయలుగా నిలిచి ఉంటారన్నారు.సరిహద్దులను కాపాడేది సైనికులు అయితే, సమాజంలో అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తించే పోలీసుల యొక్క విధి నిర్వహణ క్లిష్టతరం మరియు కత్తి మీద సాము లాంటిదన్నారు.ఈ నేపథ్యంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ డి.ఎస్.పి వేణుగోపాల్,సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.