తుని నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించేందుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా తుని నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తుండగా, ఈ రోజు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాధపురంలో ప్రచార సభ జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ గంట్ల చిన్నారావు, ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మెగా డీఎస్సీ చేపట్టడం, రాష్ట్రానికి భారీ కంపెనీలు తీసుకురావడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం కూటమికి మద్దతుగా నిలవాలని, రాక్షస పాలన ముగిసి రామరాజ్యం ప్రారంభమైందని ఆయన అన్నారు.
డాక్టర్ గంట్ల చిన్నారావు మాట్లాడుతూ, తుని నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి ఓటరు తమ తొలి ప్రాధాన్యతా ఓటును ఆయనకు వేసి విజయం సాధించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, బోడపాటి సత్యనారాయణ, సామినీడి కృష్ణార్జునుడు, ఎల్ ఎస్ ఎన్ మూర్తి, జగన్నాధపురం మాజీ సర్పంచ్ ఎర్ర సత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు, బంటుపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రచారం ముగింపు సందర్భంగా కూటమి నాయకులు తమ అభ్యర్థికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.