పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో, ఒక దివ్యాంగుడికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ తన కుమారుడు దివ్యాంగుడని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రికి విన్నవించారు.
ఆమె విజ్ఞప్తికి వెంటనే స్పందించిన చంద్రబాబు, లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏసమ్మ నుంచి ఎటువంటి దరఖాస్తు లేకపోయినా, ఆమె ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫోటో ఆధారంగా అధికారులు ఆమె వివరాలను సేకరించారు. గురువారం భీమవరంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఏసమ్మ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఏసమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణ ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఆమెకు భరోసానిచ్చిందని అన్నారు.
కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ఏసమ్మకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. భర్తను కోల్పోయి కుమారుడి అనారోగ్యంతో బాధపడుతున్న ఏసమ్మకు ఈ ఆర్థిక సహాయం కొంత ఊరటనిచ్చిందని అధికారులు తెలిపారు.
