ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా తొలగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా నిర్మూలించేందుకు కొత్త విధానాన్ని సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత మెరుగుదల, నీటి కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రాన్ని ‘జీరో పొల్యూషన్’ దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై వెంటనే చర్యలకు దిగకుండా ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని, మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు.
ALSO READ:Ayodhya Temple: అయోధ్య రామ మందిరంలో చారిత్రక ఘట్టం…మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ
పరిశ్రమలకు అనుమతుల మంజూరును వేగవంతం చేసేందుకు రెడ్ జోన్ పరిశ్రమలకు 12 రోజుల్లో, ఆరెంజ్ జోన్‌కు 10 రోజుల్లో, గ్రీన్ జోన్‌కు 3 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్ణయించారు.
పంట పొలాల్లో ప్లాస్టిక్ షీట్ల బదులుగా పర్యావరణ హితమైన బయోషీట్లు వాడకాన్ని రైతుల్లో ప్రోత్సహించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు తెలియజేయగా, అవసరమైన నియామకాలకు సీఎం అంగీకారం తెలిపారు.
