ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రముఖ అంకాలజిస్ట్ డా. మురళీధర్ మాట్లాడుతూ, క్యాన్సర్ పై అపోహలు వద్దని, ముందుగా గుర్తిస్తే సమయానికి సరైన చికిత్స పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్, ఓవరియన్, సెర్వికల్ క్యాన్సర్ పెరుగుతుండటంతో, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
డా. ప్రషోబ్ మాట్లాడుతూ, క్యాన్సర్ చికిత్స కేవలం మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, భావోద్వేగ మరియు ఆర్థిక మద్దతుతో కూడుకున్నదని వివరించారు. ప్రతి రోగికి సమానంగా అధిక నాణ్యత కలిగిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్యాన్సర్ రోగులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక మానసిక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.
డా. పృధ్వీరాజ్ మాట్లాడుతూ, క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్స వంటి వైద్య పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. క్యాన్సర్ కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాలలో మిశ్రమ వైద్యం అవసరం అవుతుందని తెలిపారు. రోగులు ధైర్యంగా ముందుకు సాగి చికిత్స తీసుకుంటే, జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ శుభకర రావు మాట్లాడుతూ, ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామన్నారు. క్యాన్సర్‌ను జయించిన రోగులను ప్రత్యేకంగా సత్కరించారు. ఉచిత స్క్రీనింగ్ పరీక్షల గురించి అవగాహన కల్పిస్తూ, మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించారు.