ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో కౌలు రైతుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌలు రైతుల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకురావాలని, ఈ డిమాండ్ కోసం మార్చి 17న కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదని ఆయన విమర్శించారు.
కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు, పథకాలు, బ్యాంకు రాయితీలు అందడం లేదని జమలయ్య అన్నారు. కనీసం పండించిన పంటను కూడా కొనుగోలు కేంద్రాల్లో అమ్మే అవకాశం లేకపోతున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కొత్త కౌలు రైతు చట్టాన్ని ప్రవేశపెట్టాలని, ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. పంచనామా ఆధారంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. అలాగే, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కౌలు రైతులకు వర్తించేలాచేయాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
వేసవి కాలంలో చెరువులు, కాలువల్లో ఉన్న గుర్రపు డెక్కన్ తొలగించి, సమగ్ర పూడికతీత చేపట్టాలని జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ అన్నారు. నీటిని నిల్వ చేసి వ్యవసాయాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు సంకు వెంకటనారాయణ, వినుకొండ శ్రీను, వనమాల శాంతారావు తదితరులు పాల్గొన్నారు.