నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. మొత్తం 13,000 కోళ్లు ఉండగా, ఒక్కసారిగా 7,000 కోళ్లు మరణించడంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో తక్షణమే మృతి చెందిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టినట్లు యజమాని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పౌల్ట్రీ ఫామ్ పరిసరాల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారుల సూచనలతో యజమాని సహకరించారు.
పౌల్ట్రీ యజమాని మాట్లాడుతూ, ఈ ఘటన వల్ల తనకు రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల వ్యాధిని గుర్తించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, తీవ్రమైన వైరస్ ప్రభావంతో భారీ సంఖ్యలో మృతి చెందినట్లు తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు.
పరిస్థితిని పరిశీలించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, మిగిలిన కోళ్ల ఆరోగ్యంపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. గ్రామస్తులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండగా, అధికారులు దీనిపై మరింత పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోనున్నారు.