అటెండెన్స్ షార్టేజ్ పేరుతో క్లాసులకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె సమీపంలో జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సీటీఎం వద్ద మంగళవారం సాయంత్రం రైలు కింద పడి విద్యార్థి నందకుమార్ బలవన్మరణం చెందాడు. కదిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
నందకుమార్ (18) కుప్పం నియోజకవర్గం వీకోట మండలం కే.నక్కనపల్లెకు చెందిన రైతు మంజునాథ కొడుకు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కానీ, అటెండెన్స్ షార్ట్ కారణంగా కళాశాల యాజమాన్యం క్లాసులకు అనుమతించకపోవడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
తల్లిదండ్రులకు తన బాధను చెప్పలేక, చదువును కొనసాగించలేక తీవ్ర మనోవేదనలో మునిగిపోయిన నందకుమార్ చివరికి మంగళవారం సాయంత్రం అంగళ్లులోని తన పీజీ హాస్టల్ నుండి నడుచుకుంటూ సీటీఎం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కదిరి రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న కఠిన నిర్ణయాలే తమ కొడుకు మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.