గోపాలపట్నం ఆళ్వార్ దాస్ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం, నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
మాజీ జడ్జ్ పైలా సన్నీబాబు మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలను విక్రయించే, వినియోగించే వ్యక్తులకు కఠినమైన శిక్షలు విధించాలని సూచించారు. మానవ జీవితం ఎంతో విలువైనదని, దీన్ని మదక ద్రవ్యాల ద్వారా నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
డాక్టర్ బొంగు శ్రీనివాస్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం యువతను చెడు మార్గంలోకి తీసుకెళ్తుందని, దీని నివారణ కోసం సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి డ్రగ్ అడ్డుకట్టకు కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో 25వ వార్డు తెలుగుదేశం నాయకులు పులమరిశెట్టి సంతోష్, దాట్ల మధు, ఆళ్ల తాతారావు, ఒరిస్సా స్టీవ్ డోర్స్ వైస్ ప్రెసిడెంట్ జె.కె నాయక్, ఎన్.ఎన్. ఫరూక్, కాలేజ్ కోఆర్డినేటర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.