విజయవాడ కృష్ణలంక పోలీసులు ఏటీఎంల వద్ద మాయమాటలతో అమాయకుల డెబిట్ కార్డులను అపహరిస్తున్న చోరాగ్రేసుడిని పట్టుకున్నారు. తెలంగాణ, ఏపీలో చురుగ్గా డెబిట్ కార్డులను దొంగిలించి, ఖాతాల్లో లక్షలు కొల్లగొడుతున్న సురేష్ బాబు నుండి 78 ఏటీఎం కార్డులు, ₹2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సింగ్ నగర్ వాంబే కాలనీకి చెందిన సురేష్ బాబు అమాయక వృద్ధులు, మహిళలను టార్గెట్ చేస్తూ ఏటీఎంల వద్ద మకాం వేస్తాడు. మాయ మాటలతో వారి ఒరిజినల్ కార్డులను తీసుకుని డూప్లికేట్ కార్డులు ఇస్తాడు. ఒరిజినల్ కార్డుతో డబ్బులు డ్రా చేసుకుని జల్సా చేస్తుంటాడు.
గత నెల 21న కృష్ణలంకలోని భాస్కరరావుపేటలో ఈ వ్యూహంతో డబ్బులు డ్రా చేసిన తర్వాత, బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో సురేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు.
సురేష్ పై రెండు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై సూర్యనారాయణ, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, విజయ సారథి నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు.