తెలంగాణలో వేతన పెంపు, భద్రతా హామీల కోసం ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. తమకు రూ.18,000 వేతనం, రూ.50 లక్షల ఇన్సూరెన్స్, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, పెన్షన్ లాంటి ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.50,000 మృతి సహాయంగా అందించాలని కోరుతున్నారు.
ఈ డిమాండ్లపై కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నాకు ఆశా వర్కర్లు సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్‌లో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అప్రమత్తమై ముందస్తు అరెస్టులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ చేరకుండా పలుచోట్ల ఆశా వర్కర్లను అడ్డుకుంటున్నారు.
ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచే పోలీస్ బందోబస్తును పెంచారు. నిరసన చేపట్టేందుకు రాలిన వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆశా వర్కర్ల సంఘం హెచ్చరించింది.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ప్రభావితం కావచ్చు అని పోలీసులు వెల్లడించారు.