ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన నినాదంతో ఏపీ ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది. ఈ సేవలను మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం 9552300009 అనే అధికారిక వాట్సాప్ నెంబర్‌ను కేటాయించారు. ఈ సేవల ద్వారా ధృవపత్రాలు, పౌర సేవలు ప్రజల చేతిలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వేగవంతమైన సేవలు అందజేయనున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, యువగళం పాదయాత్ర సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకున్నానని, ప్రభుత్వ సేవలు ఒక బటన్ నొక్కితే ప్రజల వద్దకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సర్టిఫికెట్ల కోసం అధికారుల వద్దకు తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా సులభంగా పొందేలా ఈ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. మెటా ఇండియా హెడ్ సంధ్య దేవనాథన్, వాట్సాప్ డైరెక్టర్ రవి గార్గ్‌లతో కలిసి గతేడాది ఒప్పందం చేసుకుని దీనిని రూపొందించినట్లు తెలిపారు.
ప్రస్తుతం మొదటి విడతలో 161 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండో విడతలో 360 సేవలు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రియల్ టైమ్‌లో ధృవపత్రాలు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ అందించి నకిలీ ధృవపత్రాలకు అవకాశమే లేకుండా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్‌లో బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ బాట్, వాయిస్ ఆధారిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోంది.
వాట్సాప్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరిచి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని క్రోడీకరించి, డేటా లేక్ రూపొందించి సమగ్ర సేవలను అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. ఈ సేవల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయని, ఆరు నెలల్లో ఈ విధానం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు.
