తమిళనాడు బీజేపీకి బలం చేకూర్చిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక స్థానానికి దూసుకుపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడులో పాదయాత్రలు, దూకుడు తత్వంతో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన ఆయన, ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయినా ఆయన పైన కేంద్రం నమ్మకంతో ఉంది.
తాజాగా “తమిళనాడు టు ఢిల్లీ వయా ఏపీ” అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు అవకాశం దక్కించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. టీడీపీ-జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఖాళీ అయిన విజయసాయి రెడ్డి స్థానాన్ని అన్నామలైకి కేటాయించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నూతన దక్షిణ వ్యూహానికి భాగంగా భావిస్తున్నారు.
ఈ స్థానానికి మరో కీలక అభ్యర్థిగా స్మృతి ఇరానీ పేరూ పరిశీలనలో ఉంది. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా సేవలందించగా, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆమెకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, తమిళనాడులో పార్టీని సమర్థవంతంగా నడిపిన అన్నామలైకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని సమాచారం. కేంద్రంలో బలమైన ప్రతినిధిగా ఆయనను ప్రమోట్ చేసే యత్నమని అంటున్నారు.
రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశమే కాకుండా, ఆయనకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పునాదులు పక్కగా వేయాలన్న లక్ష్యంతో అన్నామలై వంటి నేతలను పార్లమెంటులోకి తీసుకురావాలని పార్టీ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
