ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆయన తల్లి కోకిలాబెన్ అంబానీ, భార్య నీతా అంబానీ, పిల్లలు ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారు, అక్కడి నుంచి కారులో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం పడవలో త్రివేణి సంగమాన్ని చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కుంభమేళాలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ పవిత్ర కార్యంలో పాల్గొన్నారు. సన్యాసులు, భక్తులతో ఈ మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా ఉత్సవం ఆధ్యాత్మికతకు మారుపేరు కాగా, దీన్ని ప్రపంచవ్యాప్తంగా కోటికిపైగా భక్తులు సందర్శిస్తున్నారు.
కుంభమేళా ముగింపు దశకు రాగానే భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్న, రివా జిల్లాల్లో రద్దీ అధికమైంది. 50 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతోంది.
ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 44 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ముగింపు రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.