విశాఖపట్నం తాగునీటి అవసరాలకు, రైవాడ జలాశయం ఆయకట్టుకు సుపరిచితమైన నీటి మూలం. కానీ ఆదానీ సంస్థ నిర్మించబోతున్న రైవాడ ఓపెస్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రవాహానికి తీవ్ర విఘాతం కలుగుతుందని సిపిఎం నేత డి. వెంకన్న హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ ప్రాజెక్టు కోసం మారిక గ్రామంలో 213.80 ఎకరాల భూమిని భూసేకరణ చేయడానికి ఉత్తర్వులు జారీచేయడం స్థానిక గిరిజనుల హక్కులకు విఘాతం అని పేర్కొన్నారు.
విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో నీటిని పంప్ చేసి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారని చెప్పారు. సమ్మేద పైన, దిగువన రెండు రిజర్వాయర్లు నిర్మించి, శారద నదిపై ఉన్న రైవాడ జలాశయానికి వచ్చే ప్రవాహాన్ని మళ్లిస్తారని తెలిపారు. దీని వల్ల అనంతగిరి, వేపాడ ప్రాంతాల నుంచి వచ్చే వాగులు ఆదానీ రిజర్వాయర్లకు మళ్లిపోతాయని, తద్వారా రైవాడ జలాశయం నీటి లేక ఇబ్బందులు పడుతుందని స్పష్టం చేశారు.
ఈ జలాశయం కింద 21,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అలాగే విశాఖ నగరానికి రోజూ 15 ఎంజీడీ తాగునీరు ఇక్కడినుండే అందుతోంది. ఇప్పటికే ఆదనపు ఆయకట్టుకు నీరు నిలిపివేయడం వల్ల 6,000 ఎకరాలకు పైగా సాగు ప్రభావితమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా తాగునీరు, సాగునీరు రెండూ దెబ్బతిన్నా ఆదానీ ప్రాజెక్టుకు అనుమతులు నిర్ద్వంద్వంగా మంజూరు అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జలవనరుల శాఖ ఇచ్చిన నివేదికను కొట్టి వేస్తూ, ప్రభుత్వమే ఒత్తిడి చేసి అనుకూల నివేదికను రూపొందించిందని వెంకన్న ఆరోపించారు. ఆదానీ ప్రతినిధులు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లినట్టు వివరించారు. విస్తృత ప్రజా వ్యతిరేకత మధ్య ప్రభుత్వం ముందడుగు వేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నదన్నారు. ఈ దుర్మార్గానికి పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వెంటనే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
