కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ మావోయిస్టు కేడర్ ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, నిత్యావసర సరుకులు అందజేశారు.
లచ్చన్న వదిన, అన్న కొడుకుతో ఆప్యాయంగా మాట్లాడిన ఏసీపీ, వారి జీవనోపాధి, కుటుంబ పరిస్థితి, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి విషయాలను తెలుసుకున్నారు. కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని, పిల్లల చదువుల కోసం కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోటపల్లి సీఐ, ఎస్సైతో పాటు గ్రామస్తులు, పోలీసులు పాల్గొన్నారు. ఏసీపీ చేసిన ఈ పరామర్శ గ్రామస్తుల్లో విశేష ప్రోత్సాహాన్ని కలిగించింది.