అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ప్రేమోన్మాది గణేష్ తన ప్రేమను తిరస్కరించిన యువతి గౌతమిపై యాసిడ్ దాడి చేశాడు. నిందితుడు బాధితురాలి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి, యాసిడ్ పోసి, కత్తితో ఆమెను దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తక్షణమే స్పందించి కేసు నమోదు చేయించారు.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాధునిక నైపుణ్యాలతో నిందితుడి చుట్టూ ఉచ్చుపోతు, మదనపల్లె అంగళ్లు వద్ద అతడిని అరెస్ట్ చేశారు. 24 గంటల లోపే నిందితుడిని పట్టుకోవడం పోలీసుల విజయంగా పేర్కొన్నారు. విచారణలో నిందితుడి వద్ద నుండి సెల్‌ఫోన్, యాసిడ్ కొనుగోలు బిల్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో మహిళల భద్రత కోసం పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. మహిళలపై ఎటువంటి దాడులను ఉపేక్షించేది లేదని, దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మైనర్లకు బైకులు ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ప్రజల భద్రత కోసం ‘అన్నమయ్య పోలీస్ వాట్సాప్ ఛానల్’ ప్రారంభించామని ఎస్పీ ప్రకటించారు. ప్రజలు ఈ ఛానల్‌ను ఫాలో అవ్వాలని, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీసులు అత్యాధునిక దర్యాప్తు పద్ధతుల ద్వారా నిందితులను శిక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.