ఇంట్లో ఒక ఐఏఎస్ అధికారో.. ఐపీఎస్ అధికారో ఉంటే సహజంగానే ఉబ్బితబ్బిబ్బవుతాం. కానీ ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు, అలాగే 28 వైద్యులు ఉన్న కుటుంబం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది సత్యం! కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్ కుమార్ గుప్తా కుటుంబంలో ఇలా ఉన్నతాధికారులు, ఉన్నత వృత్తుల్లో ఉన్నవారే.
జ్ఞానేశ్ కుమార్ గుప్తా పెద్ద కుమార్తె మేధా రూపం, ఆమె భర్త మనీష్ బన్సల్ ఇద్దరూ 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. మేధా ప్రస్తుతం యూపీలోని కాస్‌గంజ్ జిల్లా డీఎం (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్)గా ఉన్నారు. ఆమె భర్త మనీష్ బన్సల్ యూపీలోని సహారన్పూర్ డిఎంగా నియమితులయ్యారు. రెండో కుమార్తె అభిశ్రీ ఐఆర్ఎస్ అధికారిణి. ఆమె భర్త అక్షయ్ లబ్రూ ఐఏఎస్ ఆఫీసర్.
జ్ఞానేశ్ కుమార్ గుప్తా సోదరుడు మనీశ్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. చెల్లి భర్త ఉపేంద్ర జైన్ కూడా ఐపీఎస్సే. మనీశ్ సోదరి రోలి ఇండోర్‌లో ఒక పాఠశాల నడుపుతున్నారు. ఈ కుటుంబం లోని 28 మంది వైద్యులు ఎవరి బంధువు వారు అందరికీ సేవలు అందిస్తున్నారు. ఈ కుటుంబం విశేషంగా ప్రఖ్యాతి పొందింది.
జ్ఞానేశ్ కుమార్ గుప్తా 1988 బ్యాచ్, కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మొదటగా ఆయన తిరువనంతపురంలో జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసి, 2007 నుంచి 2012 వరకు, మన్మోహన్ సింగ్ హయాంలో రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.