డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, గిరిజన ప్రాంతాల్లో రెండు వేల రహదారుల కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
గిరిజన గ్రామాల్లో డోలి మోతలు నివారణకు ప్రత్యేక గిరి వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో వసతి భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు. చలి తీవ్రతను నివారించడానికి గిరిజన ప్రాంతాల్లో పక్కా భవనాలు నిర్మించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఈ సందర్బంగా పాచిపెంట ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని మంత్రి రాక పట్ల కృతజ్ఞతలు తెలిపింది. 370 మంది విద్యార్థులకు తగిన మరుగుదొడ్లు లేవని, మరుగుదొడ్లు నిర్మించాలంటూ ఆమె చేసిన వినతిపై మంత్రి తక్షణ చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశించారు.
రహదారి సమీపంలో ఉన్న ఆశ్రమ పాఠశాలకు భద్రత కల్పించేందుకు ప్రహారి గోడకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అలాగే, వసతి గృహాల్లో విద్యార్థుల ఆహార మెనూలో మార్పులు చేసి, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం మెరుగుపరుస్తామని మంత్రి అన్నారు.