హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విశేషాలు వెల్లడించారు. మెట్రో నిర్మాణం మొదటి దశలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేసినవాళ్లే ఇప్పుడు పూలదండలతో సత్కరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో విజయవంతమైన ప్రాజెక్టుగా తెలంగాణ గర్వకారణంగా నిలిచిందన్నారు.
ముంబై, చెన్నై మెట్రో రైలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విస్తరించుకుంటున్నా, హైదరాబాద్ విస్తరణలో వెనుకబడి మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మెట్రో రెండో దశకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిగాయని చెప్పారు. కొత్త ప్రణాళికలలో మొత్తం 116.4 కిలోమీటర్లకు ఆరు కారిడార్లను ప్రతిపాదించామన్నారు.
ప్రస్తుతం ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. మేడ్చల్ వైపు మెట్రో విస్తరణ కోసం డిమాండ్లు పెరుగుతున్నాయని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నిబంధనల ప్రకారం రెండో దశ ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు.
రెండో దశ పూర్తి అయితే మెట్రో మరింత పురోగతిని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయం లింక్ సహా ఈ ప్రణాళికలు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు.