వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issued notices to YS Avinash Reddy in the Vivekananda Reddy murder case after a petition by YS Sunitha challenging his bail. Supreme Court issued notices to YS Avinash Reddy in the Vivekananda Reddy murder case after a petition by YS Sunitha challenging his bail.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినా‌ష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలంటూ.. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన వ్యక్తిని.. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని కోర్టుకు వివరించారు.

డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు రెగ్యులర్‌గా వెళ్లే వారా, కాదా అని సీజేఐ ధర్మాసనం ఆరా తీయగా..డాక్టర్‌ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని.. ఆయన రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్‌ కాదని లూథ్రా కోర్టుకు తెలిపారు. అలాగే ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలన్న లూథ్రా ధర్మసనాన్ని కోరారు. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి 8వ నిందితుడిగా ఉన్నారని.. దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని కోర్టుకు వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకుని డాక్టర్ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది. అలాగే ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
మరోవైపు సుప్రీం కోర్టులో సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్‌ చేయాలని కోరగా.. వివేకా హత్య కేసు పరిణామాలను సునీత తరఫు లాయర్ లూథ్రా కోర్టుకు వివరించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిపై ప్రైవేటు ఫిర్యాదు చేయడం ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించాలని చూశారని.. ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోన్న సమయంలో ప్రైవేటు ఫిర్యాదు చేశారన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే వైఎస్ సునీతా రెడ్డి ఇవాళ ఏపీ అసెంబ్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. . సీఎంవోలో వైెఎస్ వివేకా హత్య కేసు పురోగతిపై ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *