ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లెకల్ పాండవగల్లు, జాలమంచి, గణేకల్ దొడ్డనకేరి, మాంత్రికి, పెసల బండ కపటి, ఆరెకల్లు, నాగలాపురం తదితర గ్రామాలలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలు వెళ్లారని, వలసల నివారణ కోసం తక్షణమే అన్ని గ్రామ ల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాచేపట్టారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే వెంకటేశులు మాట్లాడుతూ వేలాదిమంది వలసలు వెళుతుంటే కూటమి ప్రభుత్వం, అధికారులు నిద్రమత్తులో ఉండి వలసల నివారణ కోసం ఉపాధి హామీ పనులు కల్పించకుండా ఉపాధి హామీలో రాజకీయo చేస్తున్నారని విమర్శించారు.
గత 18 సంవత్సరాలుగా 100కు 100% పనులు కల్పిస్తూ వందరోజుల పని అత్యధిక మందికి ఉపాధికల్పించిన పేరు ఉన్న పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిజాయితీగా పనులు జరుగుతున్న గ్రామాలపై మీ రాజకీయ పెత్తనం తగదని అన్నారు. ఇప్పటికైనా మండలాధికారులు జోక్యం చేసుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్గా వీరమ్మను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్నఉచ్చిరప్ప, రామాంజనేయులు, శేఖర్ రామాంజనేయులు, భాష, తిక్కప్ప, లక్ష్మన్ సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు