- రెవెన్యూ అధికారుల్ని ఆదేశించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమావేశం
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులు ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ సూర్యతేజతో కలిసి మంత్రి నారాయణ పలు అంశాలపై మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల మొండి బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రూరల్, సిటీ పరిధిలో గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అన్ని గుంతలను త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో అనధికారికంగా 7000 కి పైగా కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో, ఆక్రమిత స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారి నుంచి నుంచి కూడా కుళాయి పన్నులు వసూలు చేయాలని సూచించారు. అనంతరం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఓబులేసు నందన్, డిప్యూటీ కమిషనర్, చెన్నుడు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు రామ్మోహన్, జానీ తదితరులు పాల్గొన్నారు.