శ్రీకాళహస్తి ఆలయం వద్ద మహిళా అఘోరి సృష్టించిన ఉద్రిక్తతకు ఎట్టకేలకు తెరపడింది. నగ్నంగా ఆలయంలోకి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటానని పట్టుబట్టిన మహిళా అఘోరి, విశాఖ నాగ క్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ సూచనతో ఒప్పుకుని వస్త్రాలు ధరించింది. రాత్రి సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లతో ఆమెకు స్వామి వారి దర్శనం చేయించారు.
ఇందుకు ముందు, ఆలయం ఎదుట మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం చేయడంతో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు ఆమెను అడ్డుకుని, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు.
అంతలో, యోగి ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా మహిళా అఘోరితో మాట్లాడి వస్త్రాలు ధరించాలని సూచించడంతో ఆమె అంగీకరించింది. ఈ ఘటనపై ఆలయ ఈవో బాపిరెడ్డి స్పందిస్తూ, సంప్రదాయ దుస్తులతో ఆలయంలోకి వచ్చిన వారికి స్వామి వారి దర్శనం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
