సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో దళిత ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్ ఆధారంగా వర్గీకరణ అమలు చేయనున్నట్లు తెలిపారు. వర్గీకరణకు త్వరలో అధ్యయన కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం లేకుండా నివేదిక నెల రోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా ఉప కులాలకు సమాన అవకాశాలు కల్పించడం ముఖ్యమని, వారి అభివృద్ధికి ఊతం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు సూచనలు చేయగా, సీఎం వాటిని సానుకూలంగా స్వీకరించారు. సుప్రీం కోర్టు తీర్పుతో పాటు, తమ ప్రభుత్వం ఎప్పటినుంచో దళితులకు అండగా ఉందని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు తెలిపారు.
దళితుల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామన్నారు.