ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్వాల్ నుంచి కుమావూ వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. సంఘటన స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అల్మోరా జిల్లా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బస్సు మార్చులా వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సులోని 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని సీఎం ధామి ఆదేశాలు జారీ చేశారు.