కడుపు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన బాలుడిని పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో స్కానింగ్ లో ఆ బాలుడి పొట్టలో 56 ఇనుప వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులన్నీ బయటకు తీశారు, కానీ వైద్యులు ఎంతో కృషి చేసినా బాలుడి ప్రాణాలను నిలబెట్టలేకపోయారు.
హత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య, స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా అతడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, కాబట్టి, తల్లిదండ్రులు ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసినపుడు, బాలుడి పొట్టలో బ్యాటరీలు, బ్లేడ్, మొలలు, గోర్లతో పాటు చిన్న చిన్న ఇనుప వస్తువులు ఉన్నట్టు గుర్తించారు.
వైద్యులు, ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆపరేషన్ అనంతరం అతను మరణించడంపై వారు విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 27 న ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రిలో ఆదిత్యకు ఆపరేషన్ జరిగి, మరుసటి రోజు ఆయన మృతి చెందారని అతని తల్లిదండ్రులు వెల్లడించారు.