ఎన్నికల హామీగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం దీపం-2 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 2,684 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులను బుధవారం సీఎం చంద్రబాబు ఆయా పెట్రోలియం సంస్థలకు అందజేశారు.
సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సబ్సిడీ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ చెల్లింపును 48 గంటల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత సదుపాయం కల్పించనున్నారు. పథక అమలులో పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, పలు లబ్దిదారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.