చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత, చేప పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్టేషన్ ఘనపూర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలని తద్వారా మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జలాశయాలలో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల చేప పిల్లల పెంపకానికి అనువైన వాతావరణం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపలను దిగుమతి స్థాయి నుండి ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం శుభపరిణామంపేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జలాశయాలలో 45కోట్ల చేప పిల్లలు సిద్ధం చేశారు అన్నారు.