Greater Hyderabad Municipal Corporation: హైదరాబాద్ నగరంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసింది.
ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనం చేసిన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. పునర్విభజనలో భాగంగా ఇప్పటివరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కు పెంచారు. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లను ఏర్పాటు చేశారు.
ALSO READ:TTD Srivani Tickets: శ్రీవాణి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
ప్రతి 45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు రూపొందించగా, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించారు.
ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి 6,000కుపైగా అభ్యంతరాలు అందగా, వాటిని పరిశీలించిన అధికారులు 40 వార్డులకు పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించారు.
ప్రస్తుత GHMC పాలకమండలి పదవీకాలం 2026 ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో, అంతకుముందే కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ పునర్విభజనతో హైదరాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
