Vizag IT investments 2025: విశాఖపట్టణం ఐటీ రంగం అభివృద్ధిలో కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కాగ్నిజెంట్‌తో సహా తొమ్మిది ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది.
వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ సంస్థలు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్న సమయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో పార్కింగ్, రహదారులు, ఫ్లైఓవర్లు, బస్ స్టాప్‌లు వంటి సదుపాయాలను విస్తరించడం అవసరం.
అదనంగా, ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలకు రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. భోగాపురం కొత్త విమానాశ్రయం, ప్రస్తుత విశాఖ విమానాశ్రయం వినియోగం కలిసి నగరానికి పెద్ద మద్దతు అవుతాయని భావిస్తున్నారు.
ALSO READ:డెడ్ చీప్‌గా T20 World Cup 2026 టికెట్లు…ఎంత అంటే ?
మెటా, గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజాలు ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లు ఏఐ ఆధారిత స్టార్టప్‌ల ఎదుగుదలకు మార్గం సుగమం చేయనున్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, సముద్రపు భూగర్భ కేబుల్స్, కంప్యూటింగ్ మౌలిక వసతులు విశాఖను హైటెక్ పరిశ్రమల కేంద్రంగా మార్చనున్నాయి.
స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వేగంగా విస్తరించనున్నాయి.
టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థల ప్రాజెక్టులు విశాఖలో అభివృద్ధి వేగాన్ని పెంచుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా అమలు అయితే మరింత పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రం మరియు కేంద్రం కలిసి నగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతారని విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఒ. నరేష్కుమార్ తెలిపారు.
