Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు.
స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజనేయులు (మాజీ ZPTC), శరత్ చంద్ర, మల్లేశం, నర్సింహారెడ్డి, అరవింద్ బాబు మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ:
కాంగ్రెస్ అంటేనే ‘నయవంచన’ అని, ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర ఆ పార్టీదని ఆరోపించారు.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ఏ ఒక్కరికీ మేలు జరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో పయనిస్తోందన్నారు.
ALSO READ:White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికేనని ఆరోపించారు. వృద్ధులకు రూ.4000 పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు.. ఇలా అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో “కరెంటు నుంచి కాంటా వరకు” ప్రతీ స్థాయిలో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేక, ధాన్యం దళారుల పాలవుతోందని మండిపడ్డారు. రైతుబంధు, రుణమాఫీ, పంటల బీమా, బోనస్ వంటి పథకాలన్నీ అటకెక్కాయని విమర్శించారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండాయేనని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
